|

గాలిపీల్చినా క్యాన్సర్




సిగరెట్ తాగితేనే క్యాన్సర్ వస్తుందా?
గుట్కా తింటేనే క్యాన్సర్ బారిన పడతారా?
పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడితే.. క్యాన్సర్ సోకుతుందా?
సిగరెట్లు తాగేవారి పక్కనున్న వారికే క్యాన్సర్ వస్తుందనుకుంటున్నారా?
మీకు ఏ అలవాట్లు లేవు కాబట్టి సేఫ్‌జోన్‌లో ఉన్నామనుకుంటున్నారా...?

సిగరెట్లు తాగరు కాబట్టి క్యాన్సర్ రాదనుకుంటున్నారా..?
అయితే.. మీరు అతిపెద్ద ప్రమాదంలో ఉన్నారన్నమాటే..
తస్మాత్ జాగ్రత్త...
మీ భ్రమల్లోంచి బయటపడండి...
మీకే అలవాట్లు లేకపోయినా.. క్యాన్సర్ రావచ్చు...
సిగరెట్లు తాగకపోయినా సమస్యలు చుట్టుముట్టొచ్చు..
క్యాన్సర్ మిమ్మల్ని బలితీసుకోవచ్చు...


ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు 200 మందిని క్యాన్సర్ కబలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. ఈ సంఖ్య చాలా ఎక్కువే. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 3 లక్షలమంది దాకా క్యాన్సర్ వ్యాధిగ్రస్తున్నట్లు అంచనా. వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. అంత్రాక్స్, స్వైన్‌ఫ్లూ వంటి ఏవో అంతుచిక్కని వ్యాధులు వచ్చి మానవాళిని అంతం చేస్తాయనుకుంటున్న మనం... చాపకిందనీరులా పాకిపోతున్న క్యాన్సర్‌ను గుర్తించడం లేదు..
క్యాన్సర్ కారకాలపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులకు ఇటీవలే కొన్ని వాస్తవాలు తెలిశాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చేసిన సర్వేల్లోనూ విస్మయపరిచే అంశాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా చూస్తే.. పది నగరాల్లో ప్రమాదకరవాయువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా మనకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టే.. ఏడు విషవాయువులు నగరాల్లో విడుదలవుతున్నాయి. ఆర్సెనిక్, బెంజిన్, బెంజోపైరీన్, ఓజోన్ వంటి ప్రమాదకర వాయువులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు కూడా ... ఇటీవలే రాజపత్రంలో స్వయంగా ముద్రించింది కేంద్రప్రభుత్వం. ఈ వాయువులన్నీ చిన్న చిన్న సమస్యలు తెచ్చిపెట్టేవి కాదు.. భయంకర్ క్యాన్సర్‌ను పుట్టించేవి..
ఇక ప్రమాదకర నగరాల జాబితా చూసినా కాస్త కలవరం కలగడం ఖాయమే. జాబితాను చూస్తే... ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కాన్పూర్, ఆగ్రా, ఇండోర్‌లు ఈ ప్రమాదక ప్రాంతాల లిస్టులో చేరిపోయాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనే... ఈ విషవాయువుల విడుదల ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
దేశం మొత్తంమీద ఎన్నో నగరాలున్నప్పటికీ.. పదింటిలోనే వీటి విడుదల పెద్దమొత్తంలో జరుగుతోంది. ఇందులోనూ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉండడమే గుబులు పుట్టిస్తోంది. వాతావరణంలో ఇలా ప్రమాదకరవాయువులు చేరడం వల్లే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహా.. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు చేసిన పరిశోధనల్లో ఈ వాస్తవమే బయటపడింది.
అందుకే.. మీరు సిగరెట్లు తాగకపోయినా... గుట్కాలు తినకపోయినా.. క్యాన్సర్ రాదుకదా అని గుండెలమీద చేయేసుకుని పడుకోకండి.. గాలిలో విస్తరిస్తున్న ఈ విషవాయువులే మీ ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకురావచ్చు.. క్యాన్సర్‌ను పుట్టించి.. మిమ్మల్ని అంతం చేయవచ్చు..

ఎలా విడుదలవుతున్నాయి?

దేశం అభివృద్ధి చెందుతోంది.. రాష్ట్రమూ అన్నిరకాలుగా డెవలప్ అవుతోంది. పరిశ్రమలు వెలుస్తున్నాయి.. ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఫలితంగా.. నగరాల్లో వాడే వాహానాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అభివృద్ధికి నిదర్శనం అన్నట్లుగా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతుంటుంది. నిత్యం వచ్చిపోయేవారితో సందడిగా ఉంటుంది. ఇదంతా అభివృద్ధికి ఓ వైపు మాత్రమే.. కానీ.. ఈ అభివృద్ధి మాటునే ఎన్నో సమస్యలకూ బీజం పడుతోంది. ఇప్పుడు సిగరెట్ తాగకున్నా.. గుట్కా తినకున్నా.. క్యాన్సర్ రావడానికీ ఈ అభివృద్ధి ఫలాలే కారణం. నగరాల్లో పెరుగుతున్న వాహనాల వల్లే.. క్యాన్సర్‌ను కలిగించే బెంజిన్, ఓజోన్ వాయువులు ఎక్కువగా విడుదలవుతున్నాయి. ముఖ్యంగా.. వాతావరణంలో ఉండే ఓజోన్ ప్రమాదకర కిరణాలను అడ్డుకుని మనల్ని కాపాడుతున్నా... వాహనాల నుంచి వచ్చే ఓజోన్ మాత్రం ప్రజల ప్రాణాలను హరిస్తోంది.
హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ జామ్‌లే. వాహనం ఏదైనా ప్రధానకూడళ్లలో కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆగాల్సి ఉంటుంది. తీవ్ర ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆగక తప్పదు. ఆ సమయంలో వాహనాలు విడుదల చేసే పొగనూ పీల్చుకోక తప్పదు. ఇలా వాహనాల నుంచి వచ్చే పొగ మీకు తెలియకుండానే మీ ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుంది. దీన్ని మీరు పెద్దవిషయంగా భావించకపోవచ్చు. కానీ.. ఈ పొగలో ఉండే ప్రమాదకర వాయువులే... మీ ఊపిరితిత్తుల్లో చేరి.. చేయాల్సిన నష్టాన్ని చేసేస్తున్నాయి. క్యాన్సర్‌ను కలగజేస్తున్నాయి.
వాహనాలు వెలువరిచే పొగే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. ఈ పొగలోనే ప్రమాదకర బెంజిన్, ఓజోన్, ఇతర కర్భన సమ్మేళనాలు ఉంటాయి. వీటిని పీల్చడం వల్లే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతున్నాయి.
వాయుకాలుష్యం వల్ల క్యాన్సర్ రాకపోవచ్చని కొట్టిపాడేయకండి.. మన దగ్గర నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు నాలుగుశాతానికి పైగా ఇలా వాయుకాలుష్యం వల్ల సోకినవే. ఒకవేళ క్యాన్సర్ రాకపోయినా.. ఊపిరితిత్తులకు సంబంధించి కూడా ఎన్నో సమస్యలు మిమ్మల్ని పట్టిపీడించే ప్రమాదమూ ఉంది.

ప్రాణం కాపాడుకోవడం ఎలా?


వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది. ప్రతీవాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన ఉన్నా.. పాటించేవారు చాలా తక్కువ. ఒకవేళ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ వాహనాల నుంచి విపరీతంగా కాలుష్యం విడుదలవుతూనే ఉంటుంది. ఆటోలు, స్కూటర్లు, బస్సుల నుంచి తీవ్రస్థాయిలో పొగవస్తున్నా.. ట్రాఫిక్ పోలీసులు చూస్తూనే ఉంటారు తప్ప వాటిని ఆపడానికి ప్రయత్నించరు. కల్తీ ఇంధనాలను వాడడం వల్ల కూడా ప్రాణాలను హరించే ప్రమాదకరవాయువులు పెద్ద ఎత్తున ఉత్పత్తవుతున్నాయి. వీటివల్లే క్యాన్సర్ సోకే ప్రమాదం మరింతగా పెరుగుతోంది. అందుకే.. ఎక్కడికైనా వెళితే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాస్క్ కట్టుకోవడం తప్పనిసరి. దీనివల్ల కొంతవరకైనా ప్రమాదకరవాయువుల నుంచి కాపాడుకోగలుగుతారు. విపరీతంగా పొగను విడుదల చేస్తున్న బస్సులు, ఆటోల పక్కన మీ వాహనాలను ఆపకండి. ఇక పర్యావరణ అనుకూలమైన ఇంధనాల వినియోగాన్ని పెంచడం వల్ల కూడా క్యాన్సర్ కారక వాయువులను వాతావరణంలో తగ్గించుకోవచ్చు.
వాహనాలను అవసరానికి మించి వాడుతున్నారన్నది పర్యావరణవేత్తలు తరచుగా చెప్పే మాట. కానీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం సమర్థంగా లేని మన దగ్గర వ్యక్తిగత వాహనాలను వినియోగించడం తప్పనిసరి అయిపోతుంది. అయితే.. అత్యవసరం అయితే తప్ప పెట్రోలు, డీజిల్‌తో పనిచేసే వాహనాలను వాడకపోతే మంచిది.
ఇక పెద్దపెద్ద వాహనాలు.. కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే వాహనాల డిజైన్‌లోనూ మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. వాహనాలు కింది భాగంలో పొగగొట్టాలు పెట్టకుండా.. పైభాగంలో పెడితే.. వాహనదారులకు ఎంతోకొంత రక్షణ లభిస్తుంది.
అయినా... పూర్తిస్థాయిలో వాతావరణ కాలుష్యం వల్ల కలిగే క్యాన్సర్ నుంచి విముక్తి లభిస్తుందని భావించలేం. ఇవి కేవలం ముందుజాగ్రత్త చర్యలు మాత్రమే. కర్భనవాయువులను విడుదల చేయడం ఆగిపోనంతవరకూ.. క్యాన్సర్ మహమ్మారి దాడి చేస్తూనే ఉంటుంది. వాతావరణంలో ఈ ప్రమాదకర వాయువుల పరిమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.

అతిపెద్ద మహమ్మారి
క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచానికి అత్యంత ప్రమాదకర శత్రువు. ఎన్నోరకాల క్యాన్సర్లు ప్రతీరోజు వేలాదిమందిని బలికొంటున్నాయి. ఇందులో కొన్నింటిని జనం కొనితెచ్చుకుంటుంటే.. మరికొన్ని మాత్రం.. తెలియకుండానే మీద పడుతున్నాయి. వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే క్యాన్సర్ కూడా తెలియకుండా మీద పడుతున్నదే. క్యాన్సర్‌ ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్‌కు వెళ్లినా ఉపయోగం ఉండదు. తొలినాళ్లలో గుర్తిస్తే మాత్రం.. ప్రాణాలను కాపాడుకోవడం సులువే. కొన్ని లక్షణాల ఆధారంగా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. ఆకలి లేకపోవడం, మూడు వారాలకు మించి దగ్గు ఉండడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, రక్తవిరోచనాలు రావడం.. ఇలాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి.

మీరు సిగరెట్లు తాగకపోయినా.. గుట్కాలు అలవాటు లేకపోయినా.. కాలుష్యం విపరీతంగా ఉండే ప్రాంతాల్లో తిరిగితే మాత్రం క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లే. అందుకే.. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళ్లడం మర్చిపోకండి. అలసత్వంగా ఉంటే.. మీ ప్రాణానానికే ప్రమాదం రావచ్చు.


Posted by Cine Gama on 06:45. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Blog Archive

Labels

interviews